12, మే 2013, ఆదివారం

కొంగు నీరదము


పైట చెంగు విసిరేస్తే
నీలిమేఘమయ్యింది;
పన్నీటికి చిత్రంగా
చక్కని గొడుగయ్యింది||
;
అంచు అంచు లెంబడే-
ఆ చిత్రపు మెరుపులు
సరిగ మిసిమి బారులై
నా కన్నుల ముఖ ద్వారపు
తోరణాలు ఐనాయి
బంగారు తోరణాలు ఐనాయి  ||

తొలకరి పులకింతలు
ఔరా! ఆ జలదరింపు
అత్తర్ల బిందు సోనలై
ధారలుగా భువిని చేరి
భామ - కురులుగా తోచెను
సత్యభామా సిగ పాయలుగా తోచేను||
;
తూగాటల ఊయెలలై
జయభేరిని కోలలు ఐ  
పైరు చెక్కిలిని చేరి
పచ్చదనం "తాళమేయ"
గానాలు సేయగా
సన్నాయి గానాలు సేయగా ||    

[రచన:- కాదంబరి]
 కొంగు  మేఘము ఛత్రము గా ఐన వేళ
(నీరదము [గజల్: (1): ])

**********************