31, జులై 2012, మంగళవారం

భాగస్వామ్య నిష్పత్తి


"నేను చేయను"; 
"మీమాట వినను!" 
అన్నీ "న"కార సమాధానాలే 
-       -          - ఆకారములు దాల్చి, 
ఎదుట నర్తిస్తున్నాయి. 
సంఘమా! 
ఇది కాలముతోపాటు- నడిచివస్తూన్న 
"పరిణామక్రమపు అడుగుజాడలు" 
అనే నిజమును తెలుసుకుని; 
గుండె నిబ్బరం చేసుకో!
బహుశా- ఛార్లెస్ డార్విన్ - 
ఈ కోణమును- తన పరిశోధనకు ఎంచుకోలేదేమో!    
సమాజ మార్పులకు సైతమూ-
evolution theory వర్తిస్తుందని!


ఊహించే ఊహలు, 
ఊహించని యోచనలూ కూడా - 
వింత వింత స్వరూపాలతో - ప్రభవిస్తాయి, 
ప్రభవిస్తూనే ఉంటాయి, 
ఉద్భవించిన వాటికి- చైతన్య శక్తీ సమకూడి, 
ఊరికే ఒకచోట కాలు నిలువనీయదు కదా!


ఆ ఆట - 
రాస నృత్యమైనా, 
తాండవ నాట్యమైనా- 
కన్నుల ఎదుట- 
చరిత్ర తరువుకు, 
నిరంతరము పల్లవిస్తూనే ఉండే 
కొంగ్రొత్త చివురులే!
;
Artemis! Goddess of the Moon
;  ;




నేస్తమా! 
ప్రభాత కిరణాళిని వెదజల్లుతూ, 
సముల్ల్లాస ఆహ్లాదభరిత నర్తనాలుగా- 
ఆ చరణాల కదలికలను మలచగలుగుతావో.....!?


పోనీ ... 
చండ్ర నిప్పులు ఉమిసే 
మధ్యందిన మార్తాండ రేఖా వలయాలలో- 
మానవతా కువలయ పరిమళ పుష్పాలను,
కమిలిపోయేలా చేస్తావో- 


ఈ మహా నిర్మాణములో, 
నీ భాగస్వామ్యాన్ని గురించి- 
రవ్వంత ఆలోచించు! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి